అమరావతి ఆకృతులపై సమావేశం..

నార్మన్ ఫోస్టర్ బృందం అందించిన ఆకృతులపై మంత్రివర్గ సహచరులు, ఇతర ప్రభుత్వ ముఖ్యులతో సమాలోచన చేసి తుది నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించారు. దీనిపై గురువారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రాజధానిలోని నవ నగరాల్లో ముఖ్యమైన పాలనా నగరానికి సంబంధించి శాసనసభ, హైకోర్టు, సచివాలయం, శాఖాధిపతుల కార్యస్థాన భవంతుల ఆకృతులు, అంతర్గత నిర్మాణ శైలి ఎలా వుండాలన్న అంశంపై తుది ప్రణాళికలను సిద్ధం చేసిన ఫోస్టర్ బృందంతో ముఖ్యమంత్రి బుధవారం సాయంత్రం సుదీర్ఘంగా సమావేశమై పలు అంశాలపై కూలంకుశంగా చర్చించారు. వజ్రాకృతిలో శాసనసభ, బౌద్ధ స్థూపం ఆకారంలో హైకోర్టు భవంతులు ఉండాలన్న ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా  ఫోస్టర్ అండ్ పార్టనర్స్ తుది ఆకృతులను రూపొందించారు. వీటిల్లో అంతర్గత నిర్మాణ శైలి బాగుందని, బాహ్య ఆకృతుల విషయంలో మిగిలిన అందరితో చర్చించి నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. 

సచివాలయానికి సంబంధించి రెండు, మూడు ఆప్షన్లను ఇచ్చారు. మంత్రులు, కార్యదర్శులు,  విభాగాధిపతులు ఒకే ప్రాంగణంలో ఉండాలన్న  ప్రతిపాదనపై అధికారుల స్థాయిలో పలువురు అభ్యంతరాలు తెలియజేయడంతో రెండు ఆప్షన్లను గమనంలోకి తీసుకున్నామని సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ ముఖ్యమంత్రికి వివరించారు. మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులకు ఒకే భవంతిలో నాలుగైదు ఫ్లోర్లలో కార్యస్థానాలు ఉండటం వల్ల సందర్శకుల రాకతో సాధారణ పరిపాలనకు ఇబ్బందులు తలెత్తుతాయన్న అభిప్రాయంతో 300, 400 మీటర్ల దూరంలో వేర్వేరు భవంతుల్లో మంత్రులు, కార్యదర్శులకు,  విభాగాధిపతులకు  వేర్వేరుగా కార్యాలయాలు ఏర్పాటు చేయాలని భావించినట్టు, దానికి అనుగుణంగా సచివాలయ, హెచ్‌వోడీ భవంతుల నిర్మాణం జరుపుతున్నట్టు కమిషనర్ తెలిపారు. 

తరువాత ఫోస్టర్ బృందం హైకోర్టు, శాసనసభ భవంతులపై ఇచ్చిన ప్రెజెంటేషన్ ముఖ్యమంత్రి నిశితంగా ఆలకించి, నమూనా ఆకృతులను వివరంగా పరిశీలించారు. హైకోర్టు బాహ్య ఆకృతి అత్యద్భుతంగా ఉండాలని ఫోస్టర్ బృందానికి సూచించారు. శాసనసభ,  హైకోర్టు నిర్మాణాలు ప్రపంచానికే తలమానికంగా ఉండాలనేది తాను మొదటి నుంచి చెబుతున్నానని, ఇందులో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. హైకోర్టు భవంతి లోపల తమకు ఎటువంటి సౌకర్యాలు వుండాలో, అందులో అంతర్గత నిర్మాణ శైలి ఎలా ఉండాలో న్యాయమూర్తులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవచ్చునని, బాహ్య ఆకృతి మాత్రం తనతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ నచ్చి మెచ్చే విధంగా ఉండాలని చెప్పారు. మరింత సమయం తీసుకోనైనా హైకోర్టు బాహ్య ఆకృతి అత్యద్భుతంగా ఉండేలా రూపొందించి తీసుకురావాలన్నారు. ప్రపంచం మెచ్చే రాజధానిని నిర్మిస్తున్నామన్నది ఆర్కిటెక్టులు గుర్తుంచుకోవాలని చెప్పారు. 

 

YOU MAY LIKE