రివ్యూ: యుద్ధం శరణం

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వారాహి చ‌ల‌న చిత్రం దీన్ని తెర‌కెక్కించ‌డం.. ప్ర‌చార చిత్రాలు గాఢ‌తతో  కూడుకొని ఉండ‌టంతో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. మ‌రి ఆ అంచ‌నాల‌కి త‌గ్గ‌ట్టుగానే సినిమా ఉందా? ఇంత‌కీ నాగ‌చైత‌న్య యుద్ధం ఎవ‌రిపై? శ‌ర‌ణం అన్న‌ది ఎవ‌రు?

కథేంటంటే: అర్జున్‌(నాగచైతన్య) బాగా చదువుకున్న కుర్రాడు. మంచి ఉద్యోగం వచ్చినా, వదిలిపెట్టి తన అభిరుచి కొద్దీ ఆకాశంలో ఎగిరే డ్రోన్‌ తయారు చేసే పనిలో ఉంటాడు. తల్లిదండ్రులిద్దరూ వైద్యులు. ఒక స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేసి పేదలకు వైద్య సేవలు అందించే పనిలో ఉంటారు. వాళ్ల దగ్గరికి ట్రైనీగా వచ్చిన అంజలి(లావణ్య త్రిపాఠి)ని చూసి ప్రేమలో పడతాడు అర్జున్‌. తన ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి వాళ్లను ఒప్పించాలనుకునేలోపే ఇద్దరూ కనిపించకుండా పోతారు. అసలు అర్జున్‌ తల్లిదండ్రులు ఏమయ్యారు? ఆ సంఘటన జరిగిన తర్వాత అతని జీవితం ఎలా మారిపోయింది? తదితర విషయాలను తెరపైనే చూడాలి.

ఎలా ఉందంటే: కథనం ప్రధానంగా సాగే చిత్రమిది. ఒక సస్పెన్స్‌ ఎలిమెంట్‌ కథ మొత్తాన్నీ ముందుకు నడిపిస్తుంది. అనుకోకుండా తల్లిదండ్రులు దూరమయ్యాక ఓ యువకుడి జీవితంలో ఎదురైన సంఘర్షణ ఎలాంటిది? తన కుటుంబం కోసం అతను ఏం చేయాల్సి వ‌చ్చింది? అనే విషయాలతో ఈ సినిమా సాగుతుంది. తొలి సగభాగం అందమైన కుటుంబం, నాయకనాయికల ప్రేమ చుట్టూ నడుస్తుంది. ద్వితీయార్ధంలో అందుకు పూర్తి భిన్నంగా ప్రతీకార నేపథ్యం తెరపై కనిపిస్తుంది.

ఈ చిత్ర కథ, కొన్ని సన్నివేశాలు ఇదివరకు నాగచైతన్య నటించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ను గుర్తు చేస్తాయి. కాకపోతే కథానాయకుడు ఇందులో తన కుటుంబం కోసం పోరాటం చేస్తాడు. సన్నివేశాలను విభిన్నమైన కథనంతో తీర్చిదిద్దినప్పటికీ ప్రేక్షకుడి వూహకు అందేలా ఉంటాయి. బహుశా దర్శకుడు చెప్పిన కథనమే చైతూని ఆకట్టుకుని ఈ సినిమా చేసేలా ప్రోత్సహించి ఉంటుంది. ప్రతినాయకుడు నాయక్‌ పాత్రలో శ్రీకాంత్‌ కనిపించిన విధానం, ఆయన నటన బాగుంది. కానీ, ఆ పాత్రను మరింత సమర్థంగా, బలంగా తీర్చిదిద్దాల్సింది.

ఎవరెలా చేశారంటే: నాగచైతన్య తన పాత్రకు తగ్గట్టుగా, పక్కింటి కుర్రాడిలా కనిపించాడు. లావణ్య త్రిపాఠి పాత్రకు తొలి సగభాగంలోనే ప్రాధాన్యం లభించింది. ద్వితీయార్ధంలో ఆమె ఒకటి, రెండు సన్నివేశాలకు మాత్రమే పరిమితమైంది. రావు రమేష్‌, రేవతిలు తల్లిదండ్రుల పాత్రల్లో ఒదిగిపోయారు. వారి నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు కూడా ఆకట్టుకున్నాయి. ‘పెళ్లిచూపులు’తో ఆకట్టుకున్న ప్రియదర్శిలాంటి న‌టుడిని ఎంచుకున్నప్పుడు వినోదంపై మరింత దృష్టి పెట్టాల్సింది. శ్రీకాంత్‌ రూపంలో మరో ప్రతినాయకుడు చిత్ర పరిశ్రమకు దొరికాడనే చెప్పాలి. ఆయన తన నటన, ఆహార్యంతో ఆకట్టుకున్నారు. మిగిలిన పాత్రలు తమ పరిధిమేర నటించాయి.

సాంకేతికంగా ఈ సినిమా పర్వాలేదు. ఛాయాగ్రహణం కథకు తగ్గట్టుగా కుదిరింది. వివేక్‌ సాగర్‌ నేపథ్య సంగీతం బాగున్నా, పాటలు గుర్తుండిపోయేలా లేవు. తన తొలి చిత్రమే అయినా దర్శకుడు మారిముత్తు ఎంతో పరిణతితో రాసుకున్న కథను తెరపైకి తీసుకొచ్చాడు. కథపై ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. వారాహి సంస్థ నిర్మాణ విలువలు బాగున్నాయి.

YOU MAY LIKE