కిటకిటలాడుతున్న ఆలయాలు ..

రాష్ట్రంలో శ్రావణ శోభ కనిపిస్తోంది. ఆలయాలన్నీ ప్రత్యేక అలంకారంతో కళకళలాడుతున్నాయి. శ్రావణమాసం రెండో శుక్రవారం కావడంతో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వరలక్ష్మీవ్రతాలు, ప్రత్యేక పూజలతో అమ్మవారి ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు తరలివచ్చారు. శ్రావణమాసంలో అత్యంత ప్రత్యేకమైన రోజు కావడంతో మహిళలు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు చేపట్టారు. అమ్మవారికి వస్త్రాలు, బంగారం సమర్పించి వరలక్ష్మీ అనుగ్రహం కోసం పూజలు నిర్వహించారు. బెజవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయ అధికారులు వరలక్ష్మీ వ్రతం నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సామూహిక వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారికి  కుంకుమార్చన, ఇతర పూజాకార్యక్రమాలు చేపట్టారు.