ముంచెత్తుతున్న భారీ వర్షాలు !!

ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షంతో  హైదరాబాద్  తడిసి ముద్దయ్యింది . అర్ధరాత్రి 12 గంటల నుంచి  ఉదయం ఎనిమిది గంటల వరకు ఏకధాటిగా వర్షం కురిసింది.  గడచిన 24 గంటల్లో  నగర వ్యాప్తంగా  90 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసినట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. భారీ వర్షానికి భాగ్య నగర వీధులు చెరువులను తలపించాయి.  నగరంలోని ఏ కాలనీలో మోకాల్లోతూ నీళ్లే కనిపించాయి. వరదనీరు భారీగా రావడంతో  సికింద్రాబాద్ బోయిన్ పల్లి హస్మత్ పేట్ లోని చెరువు పొంగి పొర్లింది. నీటితో  పాటు కాలుష్యం తో కూడిన నురుగు కూడ బయటకు రావడం తో  చుట్టుపక్కల ప్రాంతాలు  దుర్గంధంగా మారాయి.  రెజిమెంటల్ బజార్ లో ని కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలోని గర్భగుడిలోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది.  హనుమాన్ ఆలయంలోకి కూడా నీరు చేరడంతో స్వామి వారి సేవలకు ఆటంకం ఏర్పడింది.   లాలాపేట లోని ఇందిరానగర్, సిరిపురికాలని, లక్ష్మి నగర్ ప్రాంతాల్లో మోకాళ్ళలోతూ  నీళ్లు వచ్చి చేరాయి. పలు చోట్ల ఇళ్లలోకి నీరు చేరడంతో నిత్యావసర వస్తువులు, బట్టలు కొట్టుకుపోయాయి. ముందస్తు చర్యల్లో భాగంగా పలు చోట్ల విద్యుత్ నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చిన్నపిల్లలతో  ఇటు ఇళ్లలో ఉండలేక .. అటు వర్షంలో తడవలేక అవస్ధలు పడ్డారు.  పలు చోట్ల GHMC అదికారులు NDRF సిబ్బందిని రంగంలోకి దించినా పెద్దగా ఫలితం కనిపించలేదు. ఉన్నతాధికారుల ద్వారా  పరిస్ధితిని GHMC కమిషనర్ బీసీ జనార్ధన్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.  

YOU MAY LIKE