రివ్యూ: ‘లై’

హను రాఘవపూడి చెప్పిన ఓ భిన్నమైన కథను ఎంచుకుని ‘లై’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు... ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’తో తన మార్కును చూపించారు హను రాఘవపూడి. వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమా కావడంతో ‘లై’పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ప్రచార చిత్రాల్లో నితిన్‌ స్టైలిష్‌ లుక్‌, థ్రిల్లింగ్‌ సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. మరి శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంతో నితిన్‌ మరో విజయాన్ని తనఖాతాలో వేసుకున్నారా? 

 

కథేంటంటే: పద్మనాభం (అర్జున్‌) మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌. అమెరికాలో ఉంటాడు. అతన్ని పట్టుకోవడానికి ఇండియన్‌ పోలీసులు ప్రయత్నిస్తుంటారు. ఒకసారి చిక్కినట్టే చిక్కి చేజారిపోతాడు. మళ్లీ 19ఏళ్లకు ఆ అవకాశం వస్తుంది. ఇక ఎ.సత్యం(నితిన్‌)కు అమెరికా అంటే పిచ్చి. వేగాస్‌కు వెళ్లి అక్కడి అమ్మాయిని పెళ్లి చేసుకుని సెటిల్‌ అయిపోవాలనుకుంటాడు. చైత్ర (మేఘా ఆకాష్‌ )పరమ పిసినారి. తాను కూడా వేగాస్‌ వెళ్లి జూదం ఆడి డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటుంది. సత్యంతో కలిసి వేగాస్‌ వెళ్తుంది చైత్ర. వీరిద్దరికీ ఉన్న పరిచయం ఏమిటి? పద్మనాభం పోలీసులకు దొరికాడా? అమెరికా వెళ్లిన సత్యం ఏం చేశాడు? అన్నదే ‘లై’.

 

ఎలా ఉందంటే: ఇదో స్టైలిష్‌.. యాక్షన్‌.. ఇంటెలెక్చువల్‌ థ్రిల్లర్‌. కథలో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా పద్మనాభం-సత్యంల మధ్య సాగే దాగుడుమూతలాట చాలా స్టైలిష్‌ ఉంటుంది. కథ కంటే కథనం వూపిరి బిగపట్టి చూసేలా చేస్తుంది. సినిమాను అద్భుతమైన లొకేషన్లలో తెరకెక్కించారు. అయితే ద్వితీయార్ధంలో కాస్త తడబాటు కనిపిస్తుంది. పద్మనాభం విలనిజం చూపించాల్సిన సమయంలో కథ పక్కదారి పడుతుంది. అతను మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌ ఎందుకయ్యాడో చెప్పలేదు. కథ మొత్తం ఓ కోటు చుట్టూ తిరగడం తదితర సన్నివేశాలను ప్రేక్ష‌కుడికి మరింత అర్థమయ్యేలా చెబితే బాగుండేది. దర్శకుడు తెలివితేటలన్నీ సన్నివేశాల్లో కనిపిస్తాయి. కొన్ని డైలాగ్‌లు, ఈక్వేషన్లు సామాన్య ప్రేక్షకుడు అర్థం చేసుకోవటం కష్టం. సినిమా మొత్తం సీరియస్‌ మోడ్‌లో సాగిపోతుంది. ఇలాంటి సినిమాలో వినోదం ఆశించలేం. పాటలు బాగున్నా, వాటిని అందమైన ప్రదేశాల్లో తెరకెక్కించినా, అసందర్భంగా వచ్చి కాస్త ఇబ్బందిని కలిగిస్తాయి. అయితే నాయక-నాయికల మధ్య లవ్‌ట్రాక్‌ను దర్శకుడు బాగా రాసుకున్నాడు. యాక్షన్‌ థ్రిల్లర్‌, మైండ్‌గేమ్‌ చిత్రాలను ఇష్టపడే వారికి ‘లై’ తప్పక నచ్చుతుంది. మాస్‌ను టార్గెట్‌ చేస్తూ రూపొందించిన సన్నివేశాలు అలరిస్తాయి.

ఎవరెలా చేశారంటే: నితిన్‌ ఎప్పటిలాగే చాలా హుషారుగా కనిపించాడు. గత చిత్రాల కన్నా చాలా స్టైలిష్‌గా కనిపించాడు. నితిన్‌ పాత్రలో ట్విస్ట్‌ ఈ కథ మూలం. అభిమానులు, ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో అవన్నీ నితిన్‌ ‘లై’ ద్వారా ఇచ్చాడు. మేఘా ఆకాష్‌ అందంగా కనిపించింది. తెరపై ఈ జంట ఆకట్టుకుంది. అర్జున్‌ తన విలక్షణ నటనతో మెప్పించారు. ఆయన పాత్ర సినిమాకు ప్రధాన హైలైట్‌. హీరో-విలన్ల మధ్య సాగే ఆటతో పోలిస్తే మిగిలిన పాత్రలకు ప్రాధాన్యం అంతగా ఉండదు.

YOU MAY LIKE