ముహూర్తం కుదిరింది..

ఆంధ్రప్రదేశ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. 40 కోట్ల రూపాయలతో అత్యాధునిక హంగులతో  నిర్మించిన భవనాన్ని ఈ నెల 16న ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్నారు.
రాష్ట్రవిభజన తర్వాత చాలా శాఖలు అమరావతికి తరలివచ్చాయి. కొన్ని అద్దె భవనాల్లో కార్యకలాపాలు సాగిస్తుండగా.. మరికొన్ని ఇప్పుడిప్పుడే సొంత భవనాలు నిర్మించుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా ఇన్నాళ్లూ అద్దె భవనంలో కార్యకలాపాలు సాగించారు. మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో జాతీయరహదారికి సమీపంలో అత్యాధునిక హంగులతో శాశ్వత భవనం నిర్మించారు.
గ్రీన్ క్యాపిటల్ సిద్ధాంతాన్ని ఫాలో అయిన ఏపీ పోలీసులు ప్రకృతి ఒడిలో సర్వాంగ సుందరంగా జాతీయ రహదారికి పక్కనే పోలీస్ హెడ్ క్వార్టర్స్ నిర్మించారు. మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో సుమారు రెండు ఎకరాల స్థలంలో ఐదు అంతస్థుల్లో పోలీస్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణం జరిగింది. 40 కోట్ల ఖర్చుతో లక్షా పదివేల చదరపు అడుగుల్లో భవన నిర్మాణం జరిగింది.
గతేడాది అక్టోబర్ లో హోంమంత్రి చినరాజప్ప భూమిపూజ చేసి నిర్మాణానికి శ్రాకారం చుట్టారు. డీజీపీ సాంబశివరావు భవన నిర్మాణాన్ని నిరంతరం పర్యవేక్షస్తూ.. పది నెలలోల నిర్మాణం పూర్తిఅయ్యేలా కృషి చేశారు. 40 వేల చదరపు అడుగుల వైశాల్యంతో ఉన్న గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తును సీఐడీ విభాగానికి కేటాయించారు. రెండు, మూడు అంతస్తుల్లో పీ అండ్ ఎల్, పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు, ట్రైనింగ్ ఆఫీసర్, శాంతిభద్రతల ఏడీజీ, టెక్నికల్ సర్వీసెస్ విభాగాలకు కేటాయించారు. ఆయా ఫ్లోర్లలో ఐజీలు, ఇతర అధికారులు కూర్చునేందుకు కూడా ఏర్పాట్లు చేశారు.
 ఐదో అంతస్థులో డీజీపీ కార్యాలయం, పేషీతోపాటు కాన్ఫరెన్స్‌ హాల్‌, ఎస్పీలతో మాట్లాడేందుకు సాంకేతికపరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యాలయంలో లిప్ట్‌ మొదలుకొని ఏ గదిలోపలికి ప్రవేశించాలన్నా బయోమెట్రిక్‌ తప్పనిసరి. సిబ్బంది కార్యాలయంలోకి ప్రవేశించాలంటే వేలిముద్రతోనే తలుపు తెరుచుకుంటుంది. ఆఫీసర్ల పేషీల్లోకి ఆయనతోపాటు పేషీ సీసీకి మాత్రమే బయోమెట్రిక్‌ లాక్‌ తెరిచే అవకాశం ఉంటుంది. అన్నిటికన్నా పై అంతస్తులో బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలతో సువిశాలమైన గదిలో డీజీపీ కార్యాలయం ఏర్పాటు చేశారు.
నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకుండా పచ్చని చెట్లను నరికేయకుండా ప్రొక్లెయిన్‌తో తొలగించి, మరో ప్రాంతంలో నాటారు. ప్రధాన ద్వారం నుంచి భవనంలోకి ప్రవేశించగానే కుడివైపు మెట్లు, లిప్ట్‌ ఉంటాయి. ఎడమవైపు రిసెప్షన్‌, వెయిటింగ్‌ హాల్‌ ఉంటుంది. ప్రతి ఫ్లోర్‌లోనూ ఎదురుగా కారిడార్‌ ఉంటే కుడివైపు అధికారి, ఎడమ వైపు సిబ్బంది పనిచేసేలా ఏర్పాట్లు చేశారు. కారిడార్‌లో సీసీ కెమెరాలతోపాటు ఫైర్‌ సేప్టీ ఏర్పాట్లు చేశారు. అవసరాన్ని బట్టి బుల్లెట్‌ ప్రూఫ్‌ అద్దాలు వాడినా సిబ్బంది, ఇతరత్రా గదులకు రెండు అద్దాలు అమర్చి మధ్యలో ఆర్గానిక్‌ గ్యాస్‌ నింపారు. భవనం లోపల పనిచేసుకునే వారికి బయటి ఎండ వేడి తెలియకుండా ప్రశాంత వాతావరణంలో పనిచేయడానికి వీలుగా ఏర్పాట్లు చేసినట్లు పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఇంజనీర్లు చెబుతున్నారు.
ప్రతి ఫ్లోర్‌కు డైనింగ్‌ హాల్‌, కాన్ఫరెన్స్ హాల్, రెండు కామన్‌ టాయ్‌లెట్లు నిర్మించారు. భవనానికి పశ్చిమాన పచ్చని చెట్లతో ఆహ్లాదంగా మంగళగిరి కొండ ఉంటుంది. మరోవైపు చెన్నై-కోల్‌కత జాతీయ రహదారి సుమారు రెండు కిలోమీటర్ల మేర కనిపిస్తుంది. డీజీపీ పేషీకి ఎదురుగా కాన్ఫరెన్స్‌ హాల్‌ ఉంటుంది. కారిడార్‌ నుంచి డీజీపీ పేషీ వరకూ చక్కటి కొటేషన్లతో పలు డిస్‌ప్లే బోర్డులు అమర్చారు. భవనంలో పనిచేసేవారి మనసుకు ప్రశాంతత లభించేలా చక్కటి సంగీతం వినిపించే విధంగా ఏర్పాట్లు చేశారు. జాతీయ రహదారి నుంచి ప్రధాన ద్వారం లోపల ఎకరం స్థలంలో పార్కింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. బెటాలియన్‌ కమాండెంట్‌ కార్యాలయానికి, పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌కు మధ్యలో సర్వాంగ సుందరంగా పార్కును తీర్చిదిద్దుతున్నారు. భవనం చుట్టూ అందంగా కనిపించేందుకు చెట్లను, గడ్డితో  పాటు పూలమొక్కలు ఏర్పాటు చేస్తున్నారు.
 అత్యాధునిక హంగులతో నిర్మించిన ఆంధ్రప్రదేశ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ను ఈ నెల 16న ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్నారు.