నేనే రాజు నేనే మంత్రి : రివ్యూ

తెలుగు సినిమాకు దొరికిన గ్రీకువీరుడు రానా. భళ్లాలదేవుడిగా భయపెట్టినా.. వీర సైనికుడిగా శత్రుసేనల్ని తుదముట్టించినా.. అతడికే సాధ్యం. సోలో హీరోగా ఒక్క హిట్టు కూడా కొట్టని రానా.. నేనే రాజు నేనే మంత్రి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి సోలో హిట్ సొంతం చేసుకున్నాడా..? డైరెక్టర్ తేజ సెకండ్ ఇన్నింగ్స్ కిక్ ఇచ్చిందా..? అన్నది తెలియాలంటే రివ్యూ చూడాల్సిందే.
కథలోకి వెళ్తే జోగేంద్ర (రానా), రాధ (కాజల్) జంట చూడముచ్చటగా ఉంటుంది. రాధ అంటే ప్రాణంగా బతికే జోగీంద్ర.. మె కోసం ఏం చేయడానికైనా వెనుకాడడు. వడ్డీ వ్యాపారం చేసుకుంటూ హాయిగా గడిపే రాధ, జోగేంద్ర జీవితంలో జరగిన చిన్న ఘటన.. జోగేంద్రను రాజకీయాల్లోకి లాగుతుంది. రాధకు జరిగిన అవమానానికి ప్రతీకారంగా గ్రామ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జోగేంద్ర.. తర్వాత ఏకంగా ముఖ్యముంత్రి కుర్చీ ఎక్కాలనుకుంటాడు. మరి సీఎం సీటు జోగేంద్రకు దక్కిందా..? రాధే ప్రాణంగా బతికిన జోగేంద్ర జీవితంలోకి వచ్చిన దేవికా రాణి (కేథరీన్) ఎవరు..? రాధ ముఖ్యమా..? ముఖ్యమంత్రి పీఠం ముఖ్యమా అన్న ప్రశ్న ఎదురైనప్పుడు జోగేంద్ర ఏ నిర్ణయం తీసుకున్నాడు..  అసలు జోగేంద్ర జైలుకెందుకెళ్ళాడు.. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే.. జోగేంద్ర పాత్రలో రానా సరిగ్గా సరిపోయాడు. రాజకీయాలకు అవసరైమన కన్నింగ్ మెంటాలిటీ చూపించే పాత్రలో అదరగొట్టినా రానా.. కాజల్ తో వచ్చిన సెంటిమెంట్ రొమాంటిక్ సన్నివేశాల్లో మెప్పించాడు. ఇక రాధ లాంటి పాత్రలు కాజల్ కు కొట్టిన పిండి. సంప్రదాయంగా కనిపించి.,. భర్త తప్పు చేసినా అదే కరెక్ట్ అని భావించే పాత్రలో కాజల్ ఒదిగిపోయింది. చివరకు భర్తకు తను ముఖ్యమా.. సీఎం కుర్చీ ముఖ్యమా అన్న ప్రశ్న ఎదురైనప్పుడు సంఘర్షణ పడే సన్నివేశాల్లో కాజల్ మెప్పించింది. ఇక ఓ చానల్ ఎండీ కూతురిగా దేవికా రాణి (కేథరీన్) పాత్ర బాగానే ఉన్నా సినిమాలో ఆమె పాత్ర పరిమితం. మొదట సెకండ్ హీరోయిన్ లా కనిపించినా.. తర్వాత గుంపులో గోవిందలా మారిపోయింది. చివరకు మళ్లీ ఆమే జనాన్ని నడిపించే కీ రోల్ ప్లే చేస్తుంది. ఇలా అవసరానికి తగ్గట్టు ఆమె పాత్రతో దర్శకుడు ఓ ఆట ఆడుకున్నాడనిపిస్తుంది. సినిమాలో ఇంతకంటే చెప్పుకోదగ్గ పాత్రలు లేవనే చెప్పాలి. నమ్మిన బంటులా కనిపించిన నవదీప్ పాత్ర బాగున్నా.. స్క్రీన్ ప్లే వైఫల్యంతో అర్థం లేకుండా ముగిసిపోతుంది.
సినిమాలో పాటలు పర్వాలేదనిపిస్తాయి. టైటిల్ సాంగ్ తో పాటు రానా, కాజల్ మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ బాగుంది. పాట షూట్ చేసిన విధానం బాగుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. మొత్తంగా చూస్తే డైరెక్టర్ తేజకు పాస్ మార్కులు వేయొచ్చు. ఎప్పుడూ చిన్నపిల్లల ప్రేమకథలతో మెప్పించే తేజ.. ఈసారి  రాజకీయాలపై పడ్డాడు. కానీ అంతగా మెప్పించలేకపోయాడు. సినిమా చూస్తే తేజకు మెచ్యూరిటీ వచ్చింది.. కానీ క్రియేటివిటీ కాస్త ఎక్కువైంది అనిపిస్తుంది. ఎన్నో హత్యలు చేసిన జోగీంద్ర.. భారతదేశ జెండాను పట్టుకొని సగర్వంగా నిలబడడం కాస్త విచిత్రంగా కనిపిస్తుంది. రానా క్యారెక్టర్ తీర్చిదిద్దడంలో దర్శకుడికి క్లారిటీ మిస్ అయినట్టు కనిపిస్తుంది. మొత్తంగా నేనే రాజు నేనే మంత్ర ఒక ప్రయోగం. కాకపోతే మరికాస్త శ్రద్ధ తీసుకొని ఉంటే బాగుండేది అనిపిస్తుంది.
నోట్: ఇది సినిమా చూసి రాసిన వీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

YOU MAY LIKE