మీ మొబైల్‌తో పార్కింగ్ చెక్ చేసుకోవచ్చు !

రోజురోజుకూ వాహనాల సంఖ్య పెరుగుతున్న వేళ, పనిపై బయటకు వెళ్లినప్పుడు దాన్ని ఎక్కడ పార్క్ చేయాలన్న విషయమై ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయన్న సంగతి తెలిసిందే. ఈ సమస్యను అధిగమించేందుకు బీబీఎంపీ (బృహత్ బెంగుళూరు మహానగర పాలిక) సరికొత్త స్మార్ట్ ఫోన్ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం బెంగళూరులో హాట్ కేక్ గా ఉన్న ఈ యాప్ ద్వారా మీరు వెళ్లాలని భావిస్తున్న ప్రాంతంలో ఎక్కడ పార్కింగ్ సదుపాయం ఉందన్న విషయంతో పాటు, అక్కడ స్థలాన్ని ముందుగా బుక్ చేసుకునే వీలును కూడా కల్పిస్తుంది. పార్కింగ్ ను సరళీకృతం చేయాలని భావిస్తున్న బీబీఎంపీ, బెంగుళూరులోని సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌ లో 85 పార్కింగ్ స్థలాలు గుర్తించి, వాటి నిర్వహణ కోసం టెండర్ల ప్రక్రియను చేపట్టింది. సెంట్రల్ పార్కింగ్ సర్వీసెస్, సివిక్ స్మార్ట్ అనే కంపెనీలు ముందుకు రాగా, త్వరలోనే ఓ కంపెనీకి కాంట్రాక్ట్ అప్పగిస్తామని అధికారులు తెలిపారు.

 

ఇక అత్యాధునిక ఎలక్ట్రానిక్ సెన్సార్ టెక్నాలజీ సాయంతో ఈ పార్కింగ్ లాట్ లు పని చేస్తాయి. ఏ వాహనం ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు వెళ్లిపోయింది? ఎంత సేపు ఉంది? తదితర వివరాలు సర్వర్లలో ఎప్పటికప్పుడు నిక్షిప్తం అవుతుంటాయి. ఇక పార్కింగ్ చేసిన తరువాత వాహనం వివరాలను నమోదు చేసి, వెండింగ్ మెషీన్ నుంచి టికెట్ తీసుకోవాల్సి వుంటుంది. తిరిగి వెళ్లటప్పుడు అదే టికెట్ ను మిషన్ కు చూపితే, ఎంత చెల్లించాలన్న విషయాన్ని వెల్లడిస్తుంది. మూడు కేటగిరీలుగా పార్కింగ్ స్థలాలను గుర్తించామని, గంటకు బైకులకు రూ. 5 నుంచి రూ. 15 వరకూ, కార్లకు రూ. 15 నుంచి రూ. 30 వరకూ ధరలను నిర్ణయించామని అధికారులు తెలిపారు. ఈ యాప్ పూర్తిగా అందుబాటులోకి వస్తే, ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు కొంతవరకైనా తీరుతాయని అంచనా. 

YOU MAY LIKE