రివ్యూ : ‘మేడ మీద అబ్బాయి’

మలయాళంలో ఘన విజయం సాధించిన ‘ఒరు ఒక్కడన్‌ సెల్ఫీ’ని నమ్ముకొన్నాడు. అక్కడి దర్శకుడినే ఇక్కడకు తీసుకొచ్చాడు.. మాతృకలో ఫ్లేవర్‌ ఏమాత్రం తగ్గకుండా జాగ్రత్తపడ్డాడు. మరి అందుకు తగిన ప్రతిఫలం దక్కిందా? ఈ ‘మేడ మీద అబ్బాయి’ అయినా ప్రేక్షకుల్ని నవ్వించాడా? తెలియాలంటే సమీక్షలోకి వెళ్లాల్సిందే.

కథేంటంటే..?: శ్రీను (నరేష్‌)కి చదువు పెద్దగా అబ్బదు. బీటెక్‌లో అన్ని సబ్జెక్టుల్లోనూ ఫెయిలే. సినిమా దర్శకుడు కావాలన్నది అతని కల. ఊళ్లో స్నేహితులతో కలసి షార్ట్‌ ఫిల్మ్‌ తీస్తాడు. కానీ ఉపయోగం ఉండదు. ఇంటి ఎదురుగా కొత్తగా అద్దెకు దిగిన సింధు (నిఖిల)ని చూసి ఇష్టపడతాడు. తన స్నేహితుల దగ్గర మాత్రం ‘సింధు నాకు పడిపోయింది.. మేమిద్దరం ప్రేమించుకొంటున్నాం’ అని గొప్పలు పోతుంటాడు. ఇంట్లో నాన్న (జయ ప్రకాష్‌) పోరు పడలేక, ఓ రోజు రాత్రికి రాత్రే ఎవరికీ చెప్పకుండా హైదరాబాద్‌ బ‌య‌ల్దేర‌తాడు. అదే రైలులో సింధు కనిపిస్తుంది. సింధుతో ఓ సెల్ఫీదిగి తన స్నేహితులకు పంపుతాడు శ్రీను. ఆ సెల్ఫీనే శ్రీను జీవితాన్ని తలకిందులు చేస్తుంది. వారం రోజులు హైదరాబాద్‌ అంతా తిరిగి.. మళ్లీ ఇంటికి చేరిన శ్రీనుకి అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. ఈ వారం రోజుల్లో ఏం జరిగింది? సెల్ఫీ వల్ల ఎదురైన అనర్థాలేంటి? అనేదే కథ.

తెరపై ఎలా సాగిందంటే..?: కథగా చూస్తే ఆసక్తికరంగానే అనిపిస్తుంది. బహుశా.. మలయాళ సినిమా హక్కుల్ని కొనుగోలు చేసింది కూడా కథలో బలమైన పాయింట్‌ కోసమే అయ్యింటుంది. కథలో మలుపులకు చోటుంది. దాన్ని ఆసక్తికరంగా చెప్పొచ్చు కూడా. మలయాళంలో అదే జరిగింది. సరదాగా సాగిపోతున్న కథని వూహించని మలుపులతో ముడిపెట్టి ప్రేక్షకులలో ఆసక్తి కలిగించాడు దర్శకుడు. తెలుగు రీమేక్‌లో అది కాస్త మిస్‌ అయినట్లు కనిపిస్తుంది. కథ ప్రారంభం, హీరో పరిచయం, కాలేజీ వ్యవహారాలు, స్నేహితులతో షార్ట్‌ఫిల్మ్‌ ఇవన్నీ చూడడానికి ఓకే అనిపిస్తాయి. హైపర్‌ ఆది పంచ్‌లకు చిరునవ్వులు చిందడం ఖాయం. కాకపోతే కడుపుబ్బా నవ్వేంత వినోదం మాత్రం దొరకదు. సెల్ఫీ దగ్గర్నుంచి అసలు కథ మొదలవుతుంది. అక్కడ్నుంచి వినోదం పాళ్లు తగ్గి కథలో సీరియస్‌నెస్‌ వస్తుంది. సెకండాఫ్‌ మొత్తం అన్వేషణే. హీరో హీరోయిన్‌ కోసం అన్వేషణ, హీరో, హీరోయిన్లు కలసి మరొకరి కోసం వెదుకులాట.. చివరి వరకూ ఇదే తంతు. చివర్లో వచ్చే ట్విస్టు కాస్త కొత్తగా అనిపిస్తుంది. ద్వితీయార్ధంతో పోలిస్తే ప్రధమార్ధంలో నవ్వులు పండాయి. కథనం కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంది. హీరో, హీరోయిన్ల మధ్య లవ్‌ ట్రాక్‌ను మరింత పకడ్బందీగా రాసుకుని ఉంటే బాగుండేది.

ఎవరెలా చేశారంటే..?: నరేష్‌ మరోసారి నవ్వించడానికి శతవిధాలా ప్రయత్నించాడు. కొంత వరకూ విజయవంతమయ్యాడు కూడా. సీరియస్‌ కథలో హైపర్‌ ఆది నటన, విసిరిన పంచ్‌లు నవ్వుల పువ్వులు పూయిస్తాయి. అవసరాల శ్రీనివాస్‌ ఓ రహస్య గూఢచారిలా కనిపిస్తాడు. కథానాయిక నిఖిల పర్వాలేదు. మిగిలిన వారు తమ పరిధి మేరకు నటించారు.

కథానాయకుడి పాత్ర గురించి చెబుతూ సాగిన తొలి పాట, అందులో వినిపించిన మ్యూజిక్‌ బీట్‌ ఆకట్టుకొంటుంది. నేపథ్య సంగీతం కూడా పర్వాలేదు. మాటలు అక్కడక్కడ ఓకే అనిపిస్తాయి. కాకపోతే జబర్‌దస్త్‌ పంచ్‌లే కాస్త రిపీట్‌ అయ్యాయనిపిస్తుంది. తెలుగు రీమేక్‌లో దర్శకుడు పెద్దగా రిస్క్‌ తీసుకోలేదు. మాతృకలో ఏముందో.. దాన్నే ఇక్కడా ఆవిష్కరించాడు.

 

YOU MAY LIKE