రిజర్వేషన్ ఫర్ డెత్..

 వివాహ బంధమంటే నూరేళ్ల అనుబంధం.. మరణం విడదీసే వరకు కలిసి ఉండే కల్మషం లేని జంటలు ఎన్నో ఉన్నాయి. ఎంత గొప్ప బంధమైనా మరణం తర్వాత తెగిపోవాల్సిందే. బతికున్నంతకాలం ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా జీవించినా.. మరణం తర్వాత ఎవరు ఎక్కడ అంటే సమాధానం కష్టమే. కానీ ఇక్కడ మాత్రం మరణం తర్వాత కూడా భార్యాభర్తలు కలిసే ఉంటారు. అదెలా సాధ్యమా అనుకుంటున్నారా..? అయితే కడప వెళ్దాం పదండి..
 చూశారా ఇక్కడంతా రిజర్వేషన్ అని రాసి ఉంది. ఏదైనా రెస్టారెంట్ కో.. పార్టీకో వెళ్లినప్పుడు ఇలాంటి రిజర్వేషన్ బోర్డులు చూస్తాం. కానీ ఈ రిజర్వేషన్ బోర్డులు మాత్రం ఏర్పాటు చేసింది శ్మశానంలో. ఆశ్చర్యపోతున్నారా..? అవును మీరు విన్నది నిజమే.. ఇవన్నీ తాము మరణించాక తమను ఖననం చేయాల్సిన ప్రదేశమని ముందే రిజర్వేషన్ చేసుకున్నారు. 
 కడప శివారులో క్రైస్తవులు సమాధుల తోట ఏర్పాటు చేసుకున్నారు. గతంలో ఇక్కడ మృతదేహాలను అడ్డదిడ్డంగా ఎక్కడ పడితే అక్కడ ఖననం చేసేవారు. నాలుగేళ్ల కిందట ఈ పద్దతికి స్వస్తి చెప్పారు. మరుభూమిని విస్తరించి.. చుట్టూ ప్రహరీగోడ నిర్మించారు. ప్రతి సమాధికి సంఖ్యలు కేటాయించారు. ఒక్కో వరుసలో ఎన్ని సమాధులుండాలి..? వాటి వద్దకు వెళ్లేందుకు ఎక్కడెక్కడ రోడ్లు వేయాలి.. ఇలా సమగ్రంగా లేఔట్ రూపొందించారు.
 లే అవుట్ ప్రకారం ఇళ్ల ప్లాట్ల మాదిరి స్థలాలకు మార్కింగ్‌ ఇచ్చారు. ఈ సమాధుల కేటాయింపులోనూ వైవిధ్యత చూపేలా ఈ శ్మశాన వాటికను తయారు చేశారు.  బ్రతికున్నప్పుడే కాకుండా మట్టిలోనూ తోడూనీడగా ఉండాలన్న ప్రత్యేకతతో ఈ శ్మశానాన్ని  ఏర్పాటు చేశారు. ఎక్కడాలేని విధంగా ఓ ప్రత్యేకతను చాటుకున్న ఈ శ్మశానవాటిలో పక్క పక్కనే  స్దల కేటాయింపు అవకాశం ఉంది. సమాధుల స్థల కేటాయింపులో ప్రస్తుతం ఇక్కడ రిజర్వేషన్‌ విధానం అవలంభిస్తుండటం ఓ ప్రత్యేకత.
 భార్య లేదా భర్త చనిపోయిన పక్షంలో వారిని ఆ శ్మశానంలో పూడ్చడానికి దరఖాస్తు చేస్తే అవకాశమిస్తారు. అక్కడ గుంతతవ్వి  పూడ్చవచ్చు. ఆ వ్యక్తి స్థాయిని బట్టి సమాధి నిర్మాణం చేసుకోవచ్చు. దాని పక్కనే ఉన్న స్థలంలో చనిపోయిన వ్యక్తి జీవితభాగస్వామి స్థలాన్ని రిజర్వు చేసుకోవచ్చు. ఇందుకు కేవలం నిర్వహణ ఖర్చులు చెల్లిస్తే సరిపోతుంది. ఎన్నేళ్లపాటైనా సదరు వ్యక్తి పేరుతో ఆ స్థలం కేటాయిస్తారు. ఇలా భార్యాభర్తలిద్దరూ చనిపోయిన తర్వాత కూడా సమాధుల రూపంలో ప్రేమబంధం పెనవేసుకునే వెసులుబాటును నిర్వాహకులు కల్పించారు. ఇలా గడచిన రెండేళ్లలో 15 మంది వరకు ఇక్కడ రిజర్వు చేసుకోగా.. తల్లిదండ్రులపై అమితాభిమానం ఉన్న పిల్లలు తమ కన్నవాళ్ల బంధం కలకాలం కొనసాగేందుకు ఇక్కడ రిజర్వు చేసుకునేందుకు  ఉత్సాహం చూపిస్తున్నారు.
ఈ శ్మశాన ఏర్పాటు వెనక ఆశ్చర్యకరమైన విషయాలే ఉన్నాయి.  బ్రిటీషు కాలంలో ఓ సివిల్‌ అధికారి కడపలో జరిగిన అల్లర్లలో హత్యకు గురయ్యారు. ఆయనను ఇదే శ్మశానంలో పూడ్చిపెట్టారు. అయితే ఈయన మరణించిన అనంతరం సరిగ్గా మరో రెండు వారాలకు ఆయన సతీమణి కూడా మరణించింది. ఆమెనూ ఇక్కడే పాతిపెట్టారు. ఇలా ఆ దంపతుల సమాధుల ఏర్పాటుతో ఇక్కడ విభిన్న సంస్కృతికి తెరతీయగా.. మరికొందరు దంపతులకు అదే రీతిలో ఇక్కడ అవకాశం దక్కింది. 
 
 విభిన్నంగా ఆలోచించి ప్రేమబంధాలను మరణం కూడా విడదీయకుండా శ్మశానంలో రిజర్వేషన్ పై అంతటా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.