కల్తీ క్యాపిటల్..

క‌ల్తీకి కాదేదీ అన‌ర్హం....రాష్ట్ర రాజ‌ధాని కల్తీల‌కు కేంద్రంగా మారిపోయింది. ఆహార ప‌దార్ధాలు మాత్ర‌మే క‌ల్తీ అవుతున్నాయి అనుకుంటే పొర‌పాటే. అనారోగ్యంగా ఉండి త‌క్ష‌ణం శ‌క్తి కోసం, తినే డ్రైఫ్రూట్స్ కూడా విష‌తుల్యంగా మారుతున్నాయి. అందుకు విజయవాడ కేంద్రంగా మారుతోంది. విజ‌య‌వాడ‌లో సాగుతున్న డ్రైఫ్రూట్స్ దందాపై స్పెషల్ స్టోరీ.
ఆంధ్రప్రదేశ్ లో వ్యాపారానికి రాజధాని.. కానీ ఇప్పుడు కల్తీ వ్యాపారానికి రాజధానిగా మారుతోంది. ఎప్పటికప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు త‌నిఖీలు చేస్తున్నా  ఆహార క‌ల్తీని నిరోధించ‌డం వారికి శిరోభారంగా మారింది. ఆహారం తిన‌కుండా డ్రైఫ్రూట్స్ తిని ఆరోగ్యంగా ఉండాల‌నుకుంటే, అది కూడా ప్ర‌స్తుతం అనారోగ్యాన్నే తెచ్చిపెడుతోంది. మామిడి కాయ‌లు క‌ల్తీ, బొప్పాయి కాయ‌లు క‌ల్తీ, అంద‌రూ ఇష్ట‌ప‌డి తినే యాపిల్ కాయ‌లు కూడా క‌ల్తీ అవుతున్నాయి. ఇలా ఆహార ప‌దార్ధాల‌తో పాటుగా, పండ్లు, కాయ‌లు కూడా క‌ల్తీ అవుతున్నాయ‌నుకుంటే, ఇప్పుడా క‌ల్తీ.. డ్రైఫ్రూట్స్ ను కూడా వ‌ద‌ల్లేదు.
శ‌రీరానికి వెంట‌నే శ‌క్తినిచ్చే డ్రైఫ్రూట్స్ ను కూడా క‌ల్తీ చేయొచ్చ‌ని గాంధీన‌గ‌ర్ కు చెందిన భాగ్య‌ల‌క్ష్మీ ఎంటర్‌ప్రైజెస్ వ్యాపారి నిరూపిస్తున్నాడు. డ్రైఫ్రూట్స్ తో కోట్లాది రూపాయ‌ల వ్యాపారం చేస్తూ, విష‌తుల్య‌మ‌యిన డ్రైఫ్రూట్స్ ను అంద‌మైన ప్యాకింగ్ ల మాటున పెట్టి  భారీగా అమ్మకాలు కొన‌సాగిస్తున్నాడు. మ‌నం అత్యంత ఇష్టంగా తినే ఎండు ఖ‌ర్జూర‌, పండు ఖ‌ర్జూర‌, ఇత‌ర దేశాల నుంచి దిగుమ‌తి చేసుకునే ఇంపోర్టెడ్ ఖ‌ర్జూర‌, పూర్తిగా నాశిర‌కంగా ఉండే బాదం, పిస్తా వంటి ప‌ప్పుల‌ను నీట్ గా ప్యాక్ చేసి సొమ్ము చేసుకుంటున్నాడు. ఇత‌ర రాష్ట్రాల నుంచి తెచ్చుకునే ఆక్రూట్, అంజీర‌, ఆల్బ‌కార‌, ఇరానీ డేట్స్, కేషియో న‌ట్స్, డ్రైడేట్స్, అనాస పువ్వు వంటి వాటిని రంగు, రుచి వ‌చ్చేలా, ప్ర‌త్యేక ర‌సాయ‌నాలు వినియోగించి ఆక‌ర్ష‌ణ‌గా త‌యారు చేస్తున్నాడు. ఆ ర‌సాయ‌నాలు వాడ‌టంతో ఎండు ఖ‌ర్జూర వంటివి కూడా త్వ‌ర‌గా చెడిపోతూ, విష‌తుల్యంగా మారుతున్నాయి.
ఫుడ్ కంట్రోల్ అధికారులు భాగ్య‌ల‌క్ష్మీ ఎంట‌ర్‌ప్రైజెస్ ను త‌నిఖీలు నిర్వ‌హించారు. సుమారు 25ల‌క్ష‌ల రూపాయల విలువైన స‌రుకు సీజ్ చేశారు. డ్రైఫ్రూట్స్ లో కూడా కల్తీ చేస్తూ నిబంధ‌న‌ల‌ను తుంగ‌లో తొక్కుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.
 ఆరోగ్యం బాగుండాలని డ్రైఫ్రూట్స్ కొందామంటూ అందులోనూ కల్తీ చేసి మనుషుల ఆరోగ్యాలతో ఆడుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ధనార్జనే లక్ష్యంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
 
 
 
 
 
 
 

YOU MAY LIKE