అల్పాహారాన్ని నిర్లక్ష్యం చేస్తే ఇక అంతే...

అల్పాహారమే కదా అని చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. అదే మన పాలిట శాపంలా మారుతోంది. దీని వల్ల అనేక గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు, టీనేజ్ పిల్లలకు అల్పాహారాన్ని నిర్లలక్ష్యం చేస్తే సరైన సమయంలో పోషక పదార్థాలు అందక వారిలో పెరుగుదల నశించిపోతుంది.
కొంతమంది ఉదయాన్నే నాకు తినాలని లేదని, మరికొందరు  సమయం లేకపోవడం సాకుగా చూపుతూ ఉదయాన్నే  తినకుండా హడావిడిగా పనిలో పడుతుంటారు. ఇంకొదరైతే రాత్రి నుంచి ఉపవాసం ఉంటూ.. మరుసటి రోజు మధ్యాహ్నం వరకు  దాదాపు 15 గంటలకు పైగా కడుపు మాడ్చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల వారు  కొన్ని రోజులకు అలసిపోతారని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు అల్పాహార నిర్లక్ష్యం వలన  రక్తహీనత బారిన పడటేమే కాక,  కొన్ని రోజులకు పనిమీద ఆసక్తి తగ్గిపోయేలా, చిరాకు పెరగడం వంటి మానసిక సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. అయితే ఈ సమస్యలన్నింటికి మూల కారణం అల్పాహార నిర్లలక్ష్యమేనని  నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అధ్యయనంలో వెల్లడైంది. 

పిల్లలు శారీరకంగా, మానసికంగా అభివృద్ధి చెందాలన్న,  మెదడు చురుగ్గా పనిచేయాలన్న  ఉదయాన్నే అల్పాహారం తప్పనిసరి అని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆకలితో స్కూల్‌కి వెళ్లే పిల్లలు చదువుపై ధ్యాస పెట్టక పోగా, ఆలోచనా సామర్థ్యం పైన ప్రభావం చూపుతుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. . పిల్లల ఆలోచనాశక్తి, గ్రహణశక్తి లాంటివి పెరగాలంటే అల్పాహారం తప్పనిసరని నిపుణులు చెబుతున్నారు.