అంగ రంగ వైభవంగా ఉజ్జయినీ మహంకాళి బోనాలు..

సిక్రింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర ఆదివారం అంగ రంగ వైభవంగా ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న బోనాలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. తొలిరోజు అమ్మవారికి భక్తులు సంప్రదాయ బోనాలతో పాటు సారె సమర్పించారు. అమ్మవారి దర్శనానికి సుమారు 20 లక్షల మందికిపైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం ఆరు క్యూలైన్ల ద్వారా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఆదివారం తెల్లవారుజామున మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ అమ్మవారికి తొలిబోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతినిచ్చారు. తెల్లవారుజామున 3గంటల నుంచే భక్తులు అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్నారు. సికింద్రాబాద్‌ బాటా నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా మహిళలు బోనాలతో ఆలయానికి తరలి వస్తున్నారు.