దేవుళ్ళు గొర్రె మాంసం తింటారా?

వ్యాపారాల కోసం ఈ మధ్య రకరకాల వాణిజ్య ప్రకటనల్ని రూపొందిస్తున్నారు. వైవిద్యం కోసం వింతగా ఉంటున్నాయి కొన్ని ప్రకటనలు. కొత్తగా ఉంటే సమస్య లేదు అదే మతాలని, దేవుళ్ళనే వెటకారం చేసేలా ఉంటే? ఆస్ట్రేలియాకు చెందిన మీట్ అండ్ లైవ్ స్టాక్స్ ఆస్ట్రేలియా (ఎంఎల్ఏ) చేసిన ఓ యాడ్ అలానే ఉంది. వినాయకుడు, జీసస్‍తో పాటు ఇతర దేవుళ్ళతో పాటు కూర్చుని మద్యం తాగుతూ మాంసం తింటున్న ప్రకటన తీవ్ర వివాదానికి దారి తీస్తోంది. 

దేవుళ్ళందరూ కలిసి మాంసం తింటారంటూ ఈ యాడ్ తీశారు. గొర్రె మాంసాన్ని ప్రమోట్ చేసుకునేందుకు సంస్థ‌ రూపొందించిన వ్యాపార ప్రకటనపై విమర్శలు ఊపందుకున్నాయి. హిందువులు అమితంగా పూజించే వినాయకుడు కూడా మాంసం తింటున్నట్లు చూపించారు. అంతే కాకుండా ఏసుక్రీస్తు, బుద్ధుడు ఇలా అనేక మంది దేవుళ్ళ‌నీ చూపారు. మొహమ్మద్ ప్రవక్త రాలేదంటూ వెటకారం చేశారు. వీరంతా ఓ డైనింగ్ టేబుల్ పై చుట్టూ కూర్చుని మాసం తింటున్నట్టు చూపించారు. ‘గొర్రెమాంసాన్ని మనమందరమూ తినొచ్చు’ అని వారితో చెప్పించారు. అంతే కాకుండా టేబుల్‍పై ఏనుగు ఎందుకంటూ వినాయకుడిని ఉద్దేశించి వెటకారంగా మాట్లాడించారు. ఈ వ్యాపార ప్రకటన తొలుతగా 4వ తేదీన ప్రసారం అయినట్టు తెలుస్తోంది. 

ఈ యాడ్ ను తక్షణం వెనక్కు తీసుకోవాలని ఆస్ట్రేలియాలోని హిందువుల ప్రతినిధి నితిన్ వశిష్ఠ్ డిమాండ్ చేయగా, వివాదంపై స్పందించిన ఎంఎల్ఏ గ్రూప్ మార్కెటింగ్ మేనేజర్ ఆండ్ర్యూ హౌవీ, తామేమీ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించలేదని చెప్పాడు. యాడ్ ను ఉపసంహరించ బోమని స్పష్టం చేశాడు. తాము అందరూ కలిసి ఉండాలన్న ఆశయంతో ఇలా ఓ వీడియో రూపొందించినా మీరు సరిగ్గా ఆలోచించట్లేదంటూ సమర్థించుకుంటున్నారు.

YOU MAY LIKE