ఇదో భారీ రికార్డు సమోసా!

భాయ్! ఏక్ సమోసా ఔర్ ఛాయ్... ఇరానీ కేఫ్‍లలో సర్వ సాధారణంగా వినిపించే మాట. ఛాయ్‍తో పాటు సమోసా కచ్చితంగా ఉండాలనుకునే వాళ్ళని చాలా మందిని మనం చూసే ఉంటాం. ఛాయ్ లేకపోయినా సమోసాను ఇష్టపడే వారూ ఉన్నారు. చిన్న చిన్న ఉల్లి సమోసాల నుండి పెద్ద ఆలూ సమోసాలను చూసుంటాం. 150 కిలోలపైన ఉన్న సమోసాను ఎక్కడైనా చూశారా? సరిగ్గా అలాంటి సమోసానే తయారు చేశారు. కాని మన దేశంలో కాదు లండన్‍లో..

లండన్‍లో ఉన్న ఓ మసీదులో సుమారు పాతిక‌ మంది కలిసి దీన్ని తయారు చేశారు. గిన్నీస్ బుక్ రికార్డు కోసం చేసిన ఈ సమోసా బరువు 153.1 కిలోలు. గతంలో ఉన్న 110.8 కిలోల సమోసా రికార్డు బద్దలు కొట్టాలని నిర్ణయించుకున్న ముస్లిం ఎయిడ్ యూకే ఛారిటీ అనే సంస్థ ప్ర‌తినిధులు దీన్ని త‌యారు చేశారు. ఈ సమోసా తయారీని పరిశీలించడం కోసం గిన్నీస్ బుక్ సంస్థ ప్రతినిధులు మంగళవారం అక్కడికి చేరుకున్నారు. వారి పర్యవేక్షణలో దీన్ని తయారు చేశారు.

ఈ స‌మోసాను వేయించ‌డానికి 36 లీట‌ర్ల నూనెను వాడార‌ట. దీని తయారీకి దాదాపు 18 గంటల సమయం పట్టింది. ప్రత్యేక వంట పాత్రతో తయారు చేసిన ఈ సమోసా పూర్తయ్యాక ఛారిటీ ప్ర‌తినిధి ఫ‌రీద్ అస్లాం టేస్ట్ చేశారట. రుచి అద్బుతంగా ఉండటంతో యాహూ అంటూ గెంతులేశారట. అంత పెద్ద సమోసా ఆ మాత్రం రుచిగా లేకపోతే ఎలా చెప్పండి!

YOU MAY LIKE